Telugudesam: టీడీపీ తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది!: ఎంపీ హరిబాబు
- మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పై టీడీపీ పోరాడుతోంది
- ఆ పార్టీతో టీడీపీ చేతులు కలపడం ఆశ్చర్యమేస్తోంది
- టీడీపీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి మంచిది కాదు
నాడు కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అటువంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసినట్టు వార్తలు వస్తున్నాయని ఏపీ బీజేపీ ఎంపీ హరిబాబు విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పై టీడీపీ పోరాడుతోందని, ఆ పార్టీతో చేతులు కలిపిన టీడీపీ.. లోక్ సభలో వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలపడం చూస్తుంటే తనకు ఆశ్చర్యమేస్తోందని, టీడీపీ ఇవాళ తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు.
ఏపీపై కాంగ్రెస్ నాయకులు మొసలికన్నీరు కారుస్తున్నారని, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదని, విభజన చట్టం సభలో ఆమోదం పొందుతున్నప్పుడు రాష్ట్రానికి ఏం కావాలో టీడీపీ నేతలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మిందని, విభజన వల్ల ఏపీకి జరిగే నష్టాన్నిపూడ్చేందుకే ప్రత్యేక హోదాను ప్రతిపాదించారని, నాటి ప్రధాని ప్రకటన ప్రకారం ప్రత్యేక హోదాలో ఎటువంటి పారిశ్రామిక రాయితీలు ఉండవని చెప్పారు.
ప్రత్యేకహోదాలో కేంద్రం నుంచి సాయం మాత్రమే అందుతుందని, సాధారణ, ప్రత్యేక రాష్ట్రాలనే భేదం ఉండదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచినా, ఇంకా లోటు ఉన్న రాష్ట్రాలకు సాయం అందిస్తున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ కూడా హామీ ఇచ్చిందని, అయితే,14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు హోదా సాధ్యం కానందున ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించిందని చెబుతూ, ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.