Congress: వచ్చాడయ్యో సామి.. కాంగ్రెస్‌లో నూతనోత్సాహం!
- కాంగ్రెస్‌లో ఇప్పుడు రాహుల్ జపం
- లోక్‌సభలో అదరగొట్టిన అధినేత
- వెలిగిపోయిన సోనియా ముఖం
అవిశ్వాస తీర్మానం టీడీపీకి ఏ మేరకు మేలు చేసిందో కానీ, కాంగ్రెస్‌లో మాత్రం నూతనోత్సాహం తీసుకొచ్చింది. సోనియాగాంధీ ముఖం వెలిగిపోతుంటే, కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నంత పని చేస్తున్నారు. కారణం రాహుల్ ప్రసంగం. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తడబాటుకు గురికాకుండా సూటిగా, చక్కగా మాట్లాడిన రాహుల్‌పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే నేతే కాంగ్రెస్‌లో కనిపించడం లేదంటూ ఇన్నాళ్లూ బీజేపీ చేస్తున్న ప్రసంగాన్ని రాహుల్ ఒకే ఒక్క ప్రసంగంతో తిప్పికొట్టారు. రాహుల్ తన ప్రసంగంలో గణాంకాల జోలికి పోకుండా జాగ్రత్త పడ్డారు. కీలకమైన ఐదారు అంశాలను తీసుకుని మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మోదీ, అమిత్‌షాలను నేరుగా ఢీకొన్నారు. తన ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకోవాలని చూసినా మాటల దాడితో వారిని ఎదుర్కొన్నారు. మోదీ ‘జుమ్లా’ (గారడి) చేస్తున్నారంటూ మొత్తం దేశం దృష్టిని ఆకర్షించారు. రాహుల్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష సభ్యులందరూ లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారంటే ఆయన ప్రసంగం ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రాహుల్ ప్రసంగంతో కాంగ్రెస్‌లో మళ్లీ నూతనోత్తేజం కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఇప్పుడు రాహుల్ గురించే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఒకే ఒక్క ప్రసంగంతో కాంగ్రెస్ అధ్యక్షుడు దేశం దృష్టిని ఆకర్షించగలిగారు. కాంగ్రెస్‌కు ఇది ఎంతమేరకు ఉపకరిస్తుందో వేచి చూడాల్సిందే.