Cricket: ప్రపంచ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన పాకిస్థాన్

  • జింబాబ్వేతో వన్డేలో పాక్ రికార్డుల మోత
  • డబుల్ సెంచరీ సాధించిన తొలి పాక్ క్రికెటర్‌గా ఫకర్ జమాన్
  • పాక్ తరపున అత్యధిక ఫోర్లు కొట్టిన ఘనత కూడా అతడిదే

ఐదు వన్డేల  సిరీస్‌లో భాగంగా శుక్రవారం బులవాయోలో జింబాబ్వేతో జరిగిన నాలుగో వన్డేలో పాకిస్థాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు భాగస్వామ్యాన్ని పాక్ ఓపెనర్లు నమోదు చేశారు. తొలి వికెట్‌కు 304 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గత రికార్డులను బద్దలు గొట్టారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలుపెట్టింది. ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమాముల్ హక్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 156 బంతులు ఎదుర్కొన్న ఫకర్ జమాన్ 24 ఫోర్లు, 5 సిక్సర్లతో 210 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇమాముల్ హక్ 122 బంతుల్లో 8 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు జింబాబ్వే బౌలర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి 304 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామం. 2006లో ఇంగ్లండ్‌పై శ్రీలంక ఓపెనర్లు జయసూర్య-ఉపుల్ తరంగ నమోదు చేసిన 286 పరుగుల భాగస్వామం ఈ దెబ్బతో కనుమరుగైంది.

మరోవైపు, డబుల్ సెంచరీతో విరుచుకుపడిన ఫకర్ జమాన్.. ఆ ఘనత సాధించిన తొలి పాకిస్థానీ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఆరో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. శుక్రవారం పాకిస్థాన్ చేసిన 399 పరుగుల స్కోరు.. ఆ జట్టు చరిత్రలోనే అత్యధిక వన్డే స్కోరు. 28 ఫోర్లు కొట్టిన ఫకర్ మరో రికార్డును కూడా అందుకున్నాడు. పాకిస్థాన్ తరపున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగానూ ఘనత సాధించాడు.

  • Loading...

More Telugu News