No Confidence Motion: ట్రంప్, కిమ్ లే కలిశారు... పాక్ తో శాంతి కుదరదా?: ఫరూక్ అబ్దుల్లా భావోద్వేగ ప్రసంగం!
- అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా
- శాంతి దిశగా మోదీ ముందడుగు వేస్తారని అనుకున్నా
- ముస్లింలు కూడా భారతీయులేనని మరుస్తున్నారు
- కశ్మీర్ లో రాళ్ల స్థానంలో తుపాకులు, గ్రనేడ్లు వచ్చి చేరాయన్న అబ్దుల్లా
లోక్ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా భావోద్వేగ ప్రసంగం చేశారు. తాను కాశ్మీర్ గురించి తప్ప మరే విషయాలనూ మాట్లాడబోనని చెప్పిన ఆయన, ఉప్పు, నిప్పులా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ లే కలుసుకుని శాంతి దిశగా ముందడుగు వేశారని, జమ్ము కశ్మీర్ విషయంలో మాత్రం పాకిస్థాన్ తో శాంతిని కుదుర్చుకోలేని స్థితిలో భారత్ ఉందని అన్నారు.
ఇండియాలో ఉన్న ముస్లింలు అవమానాలకు గురవుతున్నారని, ముస్లింలు కూడా ఇండియన్సే నన్న సంగతని మరవరాదని చెప్పారు. తాను పాకిస్థానీని కాదని, ఇండియాలో హిందూ, ముస్లింలు ఒకటిగా నిలబడకుంటే, మనల్ని మనమే ఓడించుకున్నట్టు అవుతుందని చెప్పారు. కశ్మీర్ లోయలో రాళ్ల స్థానంలో తుపాకులు, గ్రనేడ్లు వచ్చి చేరాయని, ఇందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. పాక్ తో శాంతి దిశగా మోదీ చర్చిస్తారని, ముందడుగు పడుతుందని అనుకున్నానని, కానీ అలా జరగలేదని చెప్పారు.