jagan: జగన్ ను ఆ పార్టీ ఎంపీలే అసహ్యించుకుంటున్నారు: దేవినేని ఉమ
- అసెంబ్లీకి రారు, పార్లమెంటుకు రారు.. ఇంకెక్కడ మాట్లాడతారు?
- మోదీ అహంకారంతో మాట్లాడుతున్నారు
- కేంద్రం మెడలు వంచైనా సరే హోదాను సాధిస్తాం
బీజేపీతో యుద్ధం చేస్తున్నామంటూనే, ఆ పార్టీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. జగన్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే కుమ్మక్కు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అర్థమవుతుందని చెప్పారు. జగన్ ను రాజీనామాలు చేసిన ఆ పార్టీ ఎంపీలే అసహ్యించుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీకి రారు, పార్లమెంటుకు రారు, ఇంకెక్కడ మాట్లాడతారంటూ జగన్ ను వైసీపీ నేతలే ప్రశ్నించాలని చెప్పారు. ఎంపీల రాజీనామాలతో వైసీపీ పలాయనవాదం బయటపడిందని ఎద్దేవా చేశారు.
పార్లమెంటులో టీడీపీ నేతలు పోరాడుతుంటే, వైసీపీ నేతలు మాత్రం ఇంట్లో పడుకున్నారని ఉమ మండిపడ్డారు. ప్రధాని మోదీ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పారు. రాష్ట్రానికి మోదీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. కేంద్రం తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనలు చేపడతామని చెప్పారు.