gst: కొన్ని వస్తువులపై జీఎస్టీ పన్ను శాతం తగ్గింపు!
- ముగిసిన జీఎస్టీ 28వ మండలి సమావేశం
- శానిటరీ నాప్కిన్స్, మార్బుల్స్.. జీఎస్టీ మినహాయింపు
- సెల్ ఫోన్ బ్యాటరీలు, మిక్సీలు..పన్ను శాతం తగ్గింపు
కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన జీఎస్టీ 28వ మండలి సమావేశం ముగిసింది. కొన్ని వస్తువులపై పన్ను శాతం తగ్గిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శానిటరీ నాప్కిన్స్, మార్బుల్స్, రాఖీలు, చెక్క బొమ్మలకు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 13 వస్తువులపై పన్నులు తగ్గించింది. వెయ్యి రూపాయల లోపు ధరకు విక్రయించే పాదరక్షలను 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది.
లిథియం బ్యాటరీలు, వాక్యూమ్ క్లీనర్లు, మిక్సర్ గ్రైండర్లు, వాటర్ హీటర్లు, వాషింగ్ మిషన్లు,హెయిర్ డ్రైయర్లు, కూలర్లు, పాలు, ఐస్ క్రీమ్, సుగంధ ద్రవ్యాలు, బాత్రూంలను శుభ్రపరిచే రసాయనాలు, రంగులు, వార్నిష్ లను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి చేర్చింది.
చేతిసంచులు, నగల పెట్టెలు, రాతి శిల్పాలు, అలంకృత అద్దాలు, చేతితో తయారు చేసిన విద్యుత్ దీపాలను 12 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. దిగుమతి చేసుకునే యూరియాపై పన్నును 5 శాతానికి తగ్గించింది. రూ. 5 కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారస్తులు ప్రతి నెలా కాకుండా, మూడు నెలలకోసారి త్రైమాసిక జీఎస్టీ రిటర్న్స్ ను సమర్పించే వెసులుబాటు కల్పించింది.
ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ఊరట లభించింది. సవరించిన జీఎస్టీ రేట్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయని పీయూష్ గోయల్ తెలిపారు. కాగా, శానిటరీ నాప్కిన్స్ పై 12 శాతం జీఎస్టీ విధించడంపై తీవ్ర విమర్శలు తలెత్తిన నేపథ్యంలో వాటిని జీఎస్టీ నుంచి మినహాయించారు.