Kesineni Nani: ఈ రోజు ఓ చాయ్ వాలా బతికే పరిస్థితులు ఉన్నాయా?: ఎంపీ కేశినేని
- ‘చాయ్ వాలాను’ అని మోదీ గర్వంగా చెప్పుకుంటారు
- ప్రజలను మెస్మరైజ్ చేసి అధికారంలోకి రావడం కాదు
- మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
రెండు రోజుల క్రితం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించిన తీరు, ఆయన హావభావాలు తదితర విషయాలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేశినేని నాని మాట్లాడుతూ, ‘మోదీ గంటన్నరకు పైగా గొప్ప నటుడిలా మాట్లాడారు. 2014 కు ముందు మోదీ తన స్పీచ్ లతో మెస్మరైజ్ చేశారు. అప్పుడు, దేశం మొత్తం మోదీ మ్యానియా వచ్చింది. మోదీకి ప్రతిఒక్కరూ ఓటెయ్యాలని నాడు తపన పడ్డారు. గుజరాత్ ను ఒక గొప్ప రాష్ట్రంగా మోదీ ఏ విధంగా అయితే తయారు చేశారో, అదే విధంగా మన దేశాన్ని కూడా అంత గొప్పగా తీర్చిదిద్దుతారని అనుకున్నారు. అలాంటి మోదీ, నాలుగున్నరేళ్ల తర్వాత చూస్తే చేసిందేమీ లేదు.
‘నేను చాయ్ వాలాను’ అని మోదీ గర్వంగా చెప్పుకుంటారు. మరి, దేశంలో ఈరోజున ఓ చాయ్ వాలా బతికేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవు! ప్రజలను మెస్మరైజ్ చేసి అధికారంలోకి వచ్చిన మోదీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.. దేశాన్ని అభివృద్ధి చేయాలి.. పేదల పక్షాన నిలబడాలి.. పేదల సంక్షేమం కోసం పాటుపడాలి. పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతి సొమ్మును బయటపడేలా చేస్తానని చెప్పిన మోదీ చేసిందేమీ లేదు. పెద్దనోట్ల రద్దు ద్వారా ధనికులను దెబ్బకొడతానని చెప్పి పేదలను దెబ్బతీశారు. ఒకటీ రెండూ కాదు.. అన్నింట్లో మోదీ వైఫల్యం చెందారు’ అని మండిపడ్డారు.