Andhra Pradesh: ఏపీ అభివృద్ధిని అడ్డుకోడానికే వైసీపీ బంద్: మంత్రి ఆనందబాబు

  • నిరసనలు, ఆందోళనలకు అనేక మార్గాలున్నాయి
  • బంద్ లు, హర్తాళ్లు నిర్వహించడం సబబు కాదు
  • వైసీపీ బంద్ తో ఏపీ ప్రజానీకానికే నష్టం

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోడానికే వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్ర పన్నుతున్నారని, అందుకే ఆయన ఏపీ బంద్ కు పిలుపు నిచ్చారని ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. బంద్ లు, హర్తాళ్లు నిర్వహించి, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించడం ద్వారా ఏపీకి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమని అన్నారు. ఏపీ సచివాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ బంద్ వల్ల ప్రధాని నరేంద్రమోదీకి గాని, బీజేపీకి గాని ఎటువంటి నష్టమూ ఉండదని, ఏపీ ప్రజానీకానికే నష్టమని అన్నారు. నిరసనలు, ఆందోళనలు చేసుకోడానికి అనేక మార్గాలున్నాయని, బంద్ చేయాలనుకోవడం సరికాదని అన్నారు.

బీజేపీ చేసిన అన్యాయానికి, మోసానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో తమ పార్టీ అవిశ్వాసం పెట్టిందని, ఈ అవిశ్వాస తీర్మానికి 15 పార్టీలకు చెందిన 126 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతుగా నిలిచారని అన్నారు.  ఒక ప్రాంతీయ పార్టీ తమ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారని అన్నారు. తాము ఎన్డీయే నుంచి బయటకొచ్చిన నాటి నుంచే దేశంలో నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందని, అవిశ్వాసంపై చర్చను పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో విలేకరులతో, ఆ మర్నాడు ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడిన విషయాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం పార్లమెంట్ నుంచి దూరంగా పారిపోయిందని విమర్శించారు.  

2014 ఎన్నికల సందర్భంగా ‘స్కామ్ ఆంధ్రా కావాలా? స్కీమ్ ఆంధ్రా కావాలా?’ అంటూ రాష్ట్రంలో నరేంద్రమోదీ ప్రచారం చేశారని, ఇప్పుడు స్కామ్ లతో పీకల్లోతుల్లో కూరుకుపోయిన ఆర్థిక నేరగాడికి ఎలా అపాయింట్ మెంట్ ఇస్తారని నక్కా ఆనందబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసానికి 80 మంది సభ్యుల మద్దతు తీసుకొస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ లు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ దాదాపు నలభై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలో చేరారని ఆనందబాబు విమర్శించారు. ప్రజల కోసమే తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని, ఇప్పటికైనా వైసీపీ తలపెట్టిన బంద్ చేపట్టడం మానుకోవాలని, లేకుంటే ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని, తొంభై ఎనిమిది శాతానికి పైగా రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములిచ్చారని, కేవలం రెండు లేదా మూడు శాతం మంది రైతుల కోసం మిగిలిన రైతుల త్యాగాన్ని విమర్శించడం తగదని పవన్ కు ఆనందబాబు హితవు పలికారు.

  • Loading...

More Telugu News