k kesavarao: తెలంగాణ పట్ల ఎందుకు ఎవరూ సానుభూతి చూపడం లేదు?: రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేకే
- విభజనతో ఏపీతో పాటు తెలంగాణ కూడా నష్టపోయింది
- సీలేరు ప్రాజెక్టును, ఏడు మండలాలను కోల్పోయాం
- విభజన చట్టాలను అమలు చేయనప్పుడు.. వాటిని ఎందుకు చేయాలి?
రాష్ట్ర విభజన వల్ల ఏపీతో పాటు తెలంగాణ కూడా నష్టపోయిందని... అయినా తెలంగాణ పట్ల ఎందుకు ఎవరూ సానుభూతి చూపడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తాము కూడా కోరుతున్నామని చెప్పారు. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలన్నింటీనీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన వల్ల సీలేరు పవర్ ప్రాజెక్టు ఏపీకి వెళ్లి పోయిందని, దీంతో తాము కరెంటు కష్టాలను ఎదుర్కొన్నామని కేకే అన్నారు. తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ను ఇస్తామని చెప్పారని... అయితే కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. తమకు ఏపీ ఇవ్వాల్సిన విద్యుత్ ను ఇప్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అందుకే తాము విద్యుత్ ను ఛత్తీస్ ఘడ్ నుంచి కొనుక్కుంటున్నామని తెలిపారు. తమకు చెందిన ఏడు మండలాలను ఏపీకి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అయితే దాని వల్ల జరుగుతున్న నష్టం గురించే ఆందోళన చెందుతున్నామని చెప్పారు. హైకోర్టు విభజన గురించి ఎప్పుడు ప్రశ్నించినా... న్యాయశాఖ మంత్రి స్పందించడం లేదని అన్నారు. విభజన చట్టాలను అమలు చేయనప్పుడు... చట్టాలు చేసి ఏం ప్రయోజనమని విమర్శించారు. ఏపీకి రావాల్సిందంతా రావాలని తాము కోరుకుంటున్నామని, ఎక్కువ వచ్చినా తమకు అభ్యంతరం లేదని... అయితే పొరుగు రాష్ట్రాలకు మాత్రం సమస్యలను సృష్టించరాదని చెప్పారు.