kvp ramachandra rao: రాజ్యసభలో తెలుగులో అదరగొట్టిన కేవీపీ రామచంద్రరావు
- చట్టాలను అమలు చేయకపోతే.. ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు
- ఏపీకి అన్యాయం జరగడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉంది
- టీడీపీ వెళ్లిపోయాక మరో పార్టీని బీజేపీ ఉచ్చులోకి లాగింది
ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో చేసిన చట్టాలను అమలు చేయకపోవడం దారుణమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. చట్టాలను నీరుగారుస్తూ పార్లమెంటు వ్యవస్థపై నమ్మకం పోయేలా ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. చేసిన చట్టాలను అమలు చేయకపోతే పార్లమెంటు వ్యవస్థ, ప్రజాప్రతినిధులపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్లమెంటుపై ప్రజలు నమ్మకం కోల్పోతే... ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదని అన్నారు. విభజన హామీలపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగమంతా తెలుగులోనే కొనసాగింది. తెలుగులో ప్రసంగిస్తున్న ఏకైక ఎంపీని తానేనని కూడా ఆయన గర్వంగా చెప్పుకున్నారు.
ఏపీ ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని... విభజన సమయంలో అప్పటి అధికారపక్షం, ప్రతిపక్షం అంగీకరించిన హామీలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నారని కేవీపీ అన్నారు. తాము అధికారంలోకి రాగానే అన్ని హామీలను నెరవేరుస్తామంటూ ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలను మోదీ నమ్మించారని... అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయారని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పలు వేదికలపై కాంగ్రెస్ పార్టీ పలు డిమాండ్లు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హానీమూన్ చేసుకున్నాయని... కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ప్యాకేజీకి పొంగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం... సన్మానాలు చేసిందని, శాసనసభలో తీర్మానాలు కూడా చేసిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా పట్టలేదని... వైసీపీ ఎంపీలకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారన్న కారణంగానే ఎన్డీయే నుంచి వారు బయటకు వచ్చారని కేవీపీ అన్నారు. లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, వైసీపీ ట్రాప్ లో మీరు పడుతున్నారంటూ చంద్రబాబును తాను హెచ్చరించానని చెప్పారనే విషయాన్ని గుర్తు చేసిన ఆయన... టీడీపీ వెళ్లిపోయాక మరో పార్టీని బీజేపీ ఉచ్చులోకి లాగిందని చెప్పారు.
తమ బ్యాంకు అకౌంట్లలోకి రూ. 15 లక్షలు మోదీ వేస్తారని ఏపీ ప్రజలు ఎదురు చూడటం లేదని కేవీపీ అన్నారు. అవినీతిని అంతమొందిస్తామని, లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తామని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా కోరడం లేదని చెప్పారు. కేవలం విభజన చట్టాల్లో ఉన్నది మాత్రమే చేయాలని కోరుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి గెలిచాయని, అధికారాన్ని అనుభవించాయని... ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో డ్రామాలు మొదలు పెట్టాయని మండిపడ్డారు. మరోసారి వీరికి అధికారం అప్పగించినా ఏం సాధిస్తారనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.
విభజన హామీలను నెరవేర్చకపోవడంలో కేంద్రం తప్పు ఎంత ఉందో... రాష్ట్రానిది కూడా అంతే ఉందని కేవీపీ విమర్శించారు. విభజన హామీల గురించి తాము ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా, వాటని సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని... దీనికంతా కారణం స్వార్థం, నిర్లక్ష్యమేనని దుయ్యబట్టారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.