man mohan singh: పార్లమెంట్ లో ఇచ్చిన హామీని అమలు చేయాలి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
- హోదా ఇస్తామని నాడు ప్రధాని హోదాలో హామీ ఇచ్చా
- మా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది అమలు చేయలేదు
- ఆ హామీని కచ్చితంగా అమలు చేయాలి
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని హోదాలో తాను హామీ ఇచ్చానని మన్మోహన్ సింగ్ అన్నారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, తమ తర్వాత వచ్చిన ప్రభుత్వం హోదా హామీని అమలు చేయలేదని, నాడు పార్లమెంట్ లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జేడీయూ ఎంపీ రామచంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ, టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, అలాగే, బీహార్ కు కూడా హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఎంపీ రంగరాజన్ మాట్లాడుతూ, విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని, చెన్నైలో 25 శాతం మంది తెలుగువాళ్లు ఉన్నారని, ఏపీ కష్టాలు తమకు తెలుసని పేర్కొన్నారు.
అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీ ఆర్థికంగా బలమైన రాష్ట్రమని, దార్శనికుడైన చంద్రబాబు విధానాల కారణంగా రాష్ట్రాభివృద్ధి సాధ్యమైందని ప్రశంసించారు. ఇప్పుడు విభజిత ఏపీకి ఇచ్చిన ఆర్థికపరమైన హామీలు అమలు చేయాలని, అలా చేయని పక్షంలో పార్లమెంట్ పై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు.
సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోవాలని తమ పార్టీ కోరుకుందని, నాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి పదేళ్ల హోదా కావాలని నాడు అరుణ్ జైట్లీ అన్నారని, నేడు ఆర్థిక మంత్రి కాగానే ఆయన ఆ విషయం మర్చిపోయారని, 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతున్నారని దుయ్యబట్టారు.