Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య ముదిరిన సంక్షోభం.. పరస్పర వార్నింగులు!
- అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్న ట్రంప్
- తీవ్రంగా స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి
- అమెరికాపై వ్యంగ్య వ్యాఖ్యలు
అమెరికా, ఉత్తరకొరియా మధ్య విభేదాలు సమసిపోయాయనుకుంటే..ఇప్పుడు అంతర్జాతీయంగా మరో సమస్య మొదలయింది. ఉత్తరకొరియాతో సయోధ్య కుదుర్చుకున్న వెంటనే అమెరికా.. ఇరాన్ తో కయ్యం మొదలుపెట్టింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ , ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీల మధ్య కొన్నిరోజుల నుంచి ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం సాగుతోంది.
పెద్దపులితో ఆటలు వద్దని, ఇరాన్ తో యుద్ధమంటే అంత తేలిక కాదని హసన్ రౌహాని ట్రంప్ కు వార్నింగ్ ఇవ్వగా....అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్.. ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
'ఇది ఏమాత్రం నచ్చడం లేదు...కొన్ని నెలల క్రితం సంభవించిన అతిపెద్ద పేలుడు శబ్దాన్ని ప్రపంచంతో పాటుగా ఇరానియన్లు కూడా విన్నారు. ఇప్పుడే కాదు...40 ఏళ్లగా ఇలాంటి శబ్దాలు వింటూనే ఉన్నాం. ఇక చాలు...ఎన్నో సామ్రాజ్యాలు కుప్పకూలిపోవడం మేం కళ్లారా చూశాం. అంతేకాదు..మేం తలచుకోవడం వల్ల కొన్ని దేశాలు ఉనికినే కోల్పోయాయి...కాబట్టి జాగ్రత్తగా ఉండండి...'అని జావేద్ ట్విట్టర్ లో హెచ్చరించారు.
ఉత్తరకొరియాతో పాటు కొన్ని ఇతర దేశాలతో అమెరికాకు గతంలో తలెత్తిన విభేదాలను ఉద్దేశించే జావేద్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంతో రెండు దేశాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది.