BJP: బీజేపీకి చెక్ చెప్పేందుకు... త్యాగానికి సిద్ధమైన కాంగ్రెస్!
- ప్రధాని పదవిని వదులుకునేందుకు సిద్ధం
- మమత లేదా మాయావతివైపు మొగ్గు
- విపక్షాలకు సంకేతాలు పంపిన కాంగ్రెస్
బీజేపీకి, ముఖ్యంగా నరేంద్ర మోదీకి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ త్యాగానికి సిద్ధమైంది. యూపీఏ కూటమికి ఎక్కువ సీట్లు లభిస్తే, కూటమిలోని ఏ నేతనైనా ప్రధానిని చేసేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపింది. 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తే, ప్రధాని పదవిని వదులుకుంటామని, విపక్షాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని ఎవరికైనా ఆ చాన్స్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీల్లో ఒకరివైపు ఆ పార్టీ మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరూ ప్రధాని పదవిపై తమకున్న ఆసక్తిని ఇంతవరకూ వెల్లడించలేదు. ఈ సమయంలో వారికి అవకాశం ఇస్తామని చెబితే, తిరస్కరించే అవకాశం ఉండదన్నది రాహుల్ అభిప్రాయంగా తెలుస్తోంది.
ఇటీవలి అవిశ్వాస తీర్మానం సమయంలో ఎన్డీయేకు 300కు పైగా సభ్యుల మద్దతు రావడంతోనే కాంగ్రెస్ వైఖరిలో ఈ మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకు రాహుల్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. వివిధ ప్రాంతీయ పార్టీలు భిన్నాభిప్రాయాలతో ఉండటమే ఇందుకు కారణం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురొడ్డి నిలవాలంటే, సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలను కలుపుకు పోతేనే సాధ్యమవుతుందని సోనియా గాంధీ సైతం నమ్ముతూ, ప్రధాని పదవిని మరొకరికి ఇవ్వాలన్న రాహుల్ గాంధీ అభిప్రాయానికి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం, బీజేపీని అడ్డుకునేందుకు తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పదవిని ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే వ్యూహాన్ని జాతీయ స్థాయిలోనూ అమలు చేయాలన్నది కాంగ్రెస్ అభిమతం.