Surendra Singh: హిందువులు ఒక్కొక్కరు ఐదుగురిని కంటేనే దేశంలో హిందుత్వం సజీవంగా ఉంటుంది!: యూపీ బీజేపీ నేత సురేంద్ర సింగ్
- చిన్నారులకు జన్మనివ్వడం దేవుడిచ్చిన వరమని వ్యాఖ్య
- మైనారిటీలుగా మారిపోకుండా జాగ్రత్త పడాలని సూచన
- హిందువులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది
దేశంలోని హిందూ దంపతులు ప్రతి ఒక్కరూ ఐదుగురు పిల్లల్ని కనాలనీ, తద్వారా దేశంలో హిందుత్వాన్ని సజీవంగా ఉంచగలమని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. పిల్లలకు జన్మనివ్వడం అన్నది దేవుడిచ్చిన వరమని అభిప్రాయపడ్డారు. ప్రతి హిందూ జంట ఐదుగురు పిల్లల్ని కనాలని దేశంలోని సాధువులు, ఆధ్యాత్మిక గురువులు కోరుకుంటున్నారన్నారు.
ఉత్తరప్రదేశ్ లో గురువారం ఓ మీడియా సంస్థతో సురేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘హిందువులు కనీసం ఐదుగురు పిల్లల్ని కనాలి. వీరిలో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉండాలి. మిగిలిన ఒక్కరు ఎవరైనా పర్వాలేదు. హిందువులు ఐదుగురు పిల్లల్ని కంటేనే దేశంలో జనాభా నియంత్రణలో ఉంటుంది. హిందుత్వం సజీవంగా, స్థిరంగా ఉంటుంది‘ అని తెలిపారు.
చిన్నారులకు జన్మనివ్వడం అన్నది దేవుడిచ్చిన వరమని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. హిందువులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందనీ, లేదంటే భారత్ బలహీనమై పోతుందని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల సమానంగా లేకుంటే దేశంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారనీ, ఈ విషయమై అందరూ ఆలోచించాలని సింగ్ అన్నారు. భవిష్యత్ లో హిందువులు మైనారిటీలుగా మారిపోతే దానికి హిందువులే కారణమనీ, ఉగ్రవాదులు ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.
సాక్షాత్తూ శ్రీరాముడే దిగివచ్చినా దేశంలో అత్యాచార ఘటనల్ని నియంత్రించలేడని గతంలో సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అలాగే ’భారత్ మాతా కీ జై‘ అని నినదించని వారంతా పాకిస్తానీలేనని గతంలో ఆయన విమర్శించారు.