ap congress: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు అవస్థలు: ఏపీ కాంగ్రెస్ నేత శివాజీ

  • ప్రకాశం బ్యారేజి పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉంది
  • అయినప్పటికీ డెల్టాలో కాలువలకు నీరందట్లేదు
  • నారుమడులు, వరి నాట్లు ఎండిపోతున్నాయి

కృష్ణా డెల్టా రైతాంగం అష్టకష్టాలు పడుతుంటే, వారి అవసరాలు తీర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ అన్నారు. ఒక పక్క ప్రకాశం బ్యారేజి వద్ద పూర్తిస్థాయిలో నీటి మట్టం కనిపిస్తుండగా మరో పక్క డెల్టాలో ప్రధాన కాలువలు, బ్రాంచ్‌ కాలువలకు నీరందక నారుమడులు, వరి నాట్లు ఎండిపోతున్నాయని అన్నారు.

 డెల్టా పరిధిలోని అనేక నియోజకవర్గాలలో ఈ పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, శివారు భూముల పరిస్థితి అధ్వానంగా తయారైందని అన్నారు. నీటి కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా, సాగునీటి కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని గొప్పలు చెబుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాలువల ఆధునికీకరణను పూర్తి చేయడంలో ప్రభుత్వం అనుసరించిన ఉదాసీనత వల్లనే శివారు భూములకు నీరందడం లేదని అన్నారు.

ఇక ఏరువాకలో ఫొటోలకు ఫోజులిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు ఆ తర్వాత రైతుల గోడు పట్టించుకోవడం మానేశారని, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులకు ఉదయం లేచింది మొదలు రాజకీయ ప్రకటనలు చేయడం మినహా రైతుల కష్టాలు పట్టడం లేదని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని గొప్పలు చెబుతున్న వారు ఈ ఖరీఫ్‌ సీజన్‌ సగం గడిచిపోయినా ఇప్పటికీ రైతులకు రుణాలు అందించ లేకపోయారని, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగిపోయిన పరిస్థితిలో చేతిలో పెట్టుబడి లేకుండా రైతుల వ్యవసాయం ఏ విధంగా చేయగలరో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లుగా రైతులకు చేసిందేమీ లేదని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పుణ్యమా అని రైతులు తీసుకున్న రుణం పూర్తిగా మాఫీ కాకపోగా, వడ్డీలు పెరిగిపోతున్నాయని అన్నారు.

రైతులను నమ్మి బ్యాంకులు కొత్త రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని విమర్శించారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ప్రైవేటుగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అధికారులు, మంత్రులు బ్యాంకర్లతో సూక్తి ముక్తావళి నిర్వహించుకుంటూ, రుణ ప్రణాళికలు, లక్ష్యాలను చదువుతున్నారే గాని ఆచరణలో రైతులకు ఒరగబెడుతున్నదేమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి అనేక నిబంధనలు పెడుతూ, ష్యూరిటీలు అడుగుతూ రైతులను విసిగిస్తున్నారే తప్ప, అవసరానికి రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు గుర్తింపు కార్డులు, రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో, గత ఏడాది పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా అక్రమాలకు కేంద్రాలుగా మారాయంటే ఈ ప్రభుత్వ నిర్వాకం ఏమిటో స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సాగునీరు, రుణాలు అందించే విషయమై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News