DMK: మరింత క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం.. పడిపోయిన బీపీ.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
- అర్ధరాత్రి దాటక కావేరీ అసుపత్రికి తరలింపు
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
- ఆందోళనలో అభిమానులు
డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించింది. బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో శనివారం తెల్లవారుజామున 1:30 గంటలకు హుటాహుటిన చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఓ బులెటిన్లో తెలిపారు. నిపుణులైన వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
మూత్రాశయ నాళానికి ఇన్ఫెక్షన్, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కరుణానిధికి గోపాలపురంలోని ఆయన ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, గత రాత్రి బీపీ పడిపోవడంతో ఆసుపత్రికి తరలించక తప్పలేదు.
వయోభారంతో బాధపడుతున్న కరుణ ఏడాదిన్నరగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే, గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనికి తోడు గత రెండు రోజులుగా జ్వరం కూడా రావడంతో మరింత నీరసించిపోయారు. విషయం తెలిసిన డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున కరుణ నివాసానికి తరలి వచ్చారు. ఆయన కోలుకోవాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కరుణను ఇప్పటికే పలువురు ప్రముఖులు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల నుంచి మెసేజ్లు వెల్లువెత్తాయి.