Samsung: జీఎస్టీ రేట్లు తగ్గిన ఫలితం.. పలు ఉత్పత్తులపై ధరలు తగ్గించిన శాంసంగ్
- ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించిన ప్రభుత్వం
- ధరలను తగ్గిస్తున్న పలు సంస్థలు
- 7-8 శాతం తగ్గిన వస్తువుల ధరలు
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్ పలు ఉత్పత్తులపై ధరలను తగ్గించింది. ప్రభుత్వం ఇటీవల కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో శాంసంగ్ కూడా ధరలను తగ్గించింది. తగ్గిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజరేటర్లు తదితర గృహోపకరణాల ధరలను 8 శాతం తగ్గించినట్టు తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గినందున ఆ మేరకు వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శాంసంగ్ పేర్కొంది.
గోద్రెజ్ అప్లయెన్సెస్ కూడా రిఫ్రిజరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాషింగ్ మిషన్లు, చెస్ట్ ఫ్రీజర్ల ధరలను 7 నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఎల్జీ, పానసోనిక్ వంటి కంపెనీలు ఇది వరకే ధరల తగ్గింపుపై ప్రకటన చేశాయి.