Rekha sharma: మహిళా రిజర్వేషన్లపై ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ సంచలన వ్యాఖ్యలు
- రిజర్వేషన్ల వల్ల లాభపడేది వారే
- వాటిని పక్కనపెట్టి సొంతంగా ప్రయత్నించండి
- మహిళలకు పిలుపునిచ్చిన రేఖా శర్మ
మహిళా రిజర్వేషన్లపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్ పర్సన్ రేఖా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు కేవలం రాజకీయ నాయకుల భార్యలు, వారి కుమార్తెలకు మాత్రమే ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో తనకూ కొన్ని ‘రిజర్వేషన్లు’ ఉన్నాయన్న రేఖ.. రిజర్వేషన్ల ఆధారంగా తాను, తనలాంటి వారు రాజకీయాల్లోకి ప్రవేశించడం దుర్లభమన్నారు. పంచాయతీ స్థాయిల్లో ఎన్నికవుతున్న మహిళల పనితీరు గురించి ఎటువంటి సమాచారం లేకపోవడం విచారకరమన్నారు.
రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలు సొంతదారులు వెతుక్కోవడమే శ్రేయస్కరమని, రిజర్వేషన్ల గురించి ఆలోచించవద్దని రేఖ సూచించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఈ సమావేశాల్లోనే తీసుకురావాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రేఖ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.