pawan kalyan: వైయస్సార్ కుటుంబంలోని మహిళ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారా?: 'జనసైనికుల'పై ఆళ్ల నాని ఆగ్రహం
- టీడీపీకి అండగా ఉంటూ పవన్ కల్యాణ్ నాటకాలు ఆడుతున్నారు
- నాలుగు రోజులు భీమవరంలో మకాం వేసి.. తుందుర్రుకు ఎందుకు వెళ్లలేదు?
- సొంత జిల్లాకు చిరంజీవి చేసిన మేలు ఏమిటి?
జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని మండిపడ్డారు. అనైతిక రాజకీయాలకు పాల్పడే సంస్కృతి జనసైనికులదని... అందుకే వైయస్సార్ కుటుంబంలోని మహిళపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి అండగా ఉంటూ, ప్రజలను మభ్యపెట్టే విధంగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని అన్నారు.
భీమవరంలో సమస్యలపై చర్చకు రావాలంటూ జగన్ ను ఉద్దేశించి మాట్లాడటం... పవన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆళ్ల నాని అన్నారు. భీమవరంలో నాలుగు రోజులు మకాం వేసిన పవన్ ఒక్కసారి కూడా తుందుర్రుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తమ సమస్యలను తుందుర్రు పోరాట సమితి ఎన్ని సార్లు చెప్పుకున్నా... పవన్ ఎందుకు స్పందించలేదని అడిగారు. ఆక్వా ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టం జగన్ దృష్టికి రావడంతో... ఆ విషయాన్ని అసెంబ్లీలో ఆయన లేవనెత్తారని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి చేసిందే రాజశేఖరరెడ్డి అని... జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్ధమని... దమ్ముంటే పవన్ కల్యాణ్ కాని, లేదా ఆయన పార్టీ నేతలు కానీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సొంత జిల్లాకు మీ అన్న చిరంజీవి చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్నారు కనుకే పోలవరం ప్రాజెక్టు గురించి పవన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఆళ్ల నాని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలను కూడగడతానని ప్రగల్భాలు పలికిన పవన్... ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మొహం చాటేశారని విమర్శించారు. ప్రతిపక్షంపై విమర్శలు చేయడం మానేసి, అధికార టీడీపీపై విమర్శలు చేయాలని సూచించారు. రాష్ట్ర హక్కుల కోసం ఎవరు నిజాయతీగా పోరాడుతున్నారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. వైయస్ కుటుంబంపై సోషల్ మీడియాలో మీ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలపై మీరు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఫ్యాక్షనిస్టులు అంటూ వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు.