Sivaswamy: హిందూ సంఘాల జేఏసీ చైర్మన్ శివస్వామిపై ఎస్సీ, ఎస్టీ కేసు!
- నేడు మహాపాదయాత్ర తలపెట్టిన శివస్వామి
- డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం
- రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న శివస్వామి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ, మహా పాదయాత్రను తలపెట్టిన హిందూ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, అమరావతి శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామిపై శనివారం నాడు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. శివస్వామి అనుచరులు తమపై కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడ్డారని విజయవాడ డీఎస్పీ కార్యాలయంలో కొందరు అసైన్డ్ రైతులు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, శివస్వామికి నోటీసులు అందజేశారు.
నేడు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. కాగా, దాడి జరిగిందని చెబుతున్న రోజున తాను శైవక్షేత్రం పీఠంలోనే లేనని, పాదయాత్రను అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ కేసు పెట్టారని శివస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, రైతులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. తాను తలపెట్టిన మహా పాదయాత్రను ఆపబోనని, ఆదివారం సాయంత్రం యాత్రను జరిపే తీరుతామని స్పష్టం చేశారు.