Madhya Pradesh: ఐదంటే ఐదు రోజుల్లో విచారణ పూర్తి... కామాంధుడికి ఉరిశిక్ష!
- 4వ తేదీన అత్యాచారం
- 12న చార్జ్ షీట్, 28న శిక్ష ఖరారు
- మధ్యప్రదేశ్ ప్రత్యేక కోర్టు తీర్పు
ఐదేళ్ల చిన్నారిపై ఈ నెల 4వ తేదీన అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి శనివారం నాడు ఉరిశిక్షను విధిస్తూ మధ్యప్రదేశ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే రాజ్ కుమార్ కోల్ అనే యువకుడు ఆటో డ్రైవర్. నిత్యమూ కొంతమంది పిల్లలను తన ఆటోలో స్కూలుకు తీసుకెళతాడు.
ఈ క్రమంలో 4వ తేదీన ఐదేళ్ల చిన్నారిని ఆటో ఎక్కించుకుని తీసుకెళుతూ మార్గమధ్యంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో 7వ తేదీన రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 12వ తేదీన చార్జ్ షీట్ ఫైల్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 376 ఏ, బీల ప్రకారం కేసు నమోదైంది. విచారణను 23న ప్రారంభించిన న్యాయస్థానం, రాజ్ కుమార్ దోషేనని, అతనికి జీవించే హక్కు లేదని చెబుతూ శనివారం నాడు ఉరిశిక్ష విధించింది. ప్రత్యేక అడిషనల్ కోర్టు న్యాయమూర్తి మాధురి రాజ్ లాల్ ఈ తీర్పు వెల్లడించారు.