Police: తొలిరాత్రి నాడే నగలు, గిఫ్ట్ లతో ఉడాయించిన వధువు!
- బీహార్ లోని బాబువా పట్టణంలో ఘటన
- 40 ఏళ్ల వయసులో యువకుడికి పెళ్లి
- తొలిరాత్రే పారిపోయిన వధువు
40 సంవత్సరాల వయసులో తన కుమారుడికి ఎట్టకేలకు పెళ్లి చేశానన్న ఓ వృద్ధురాలి ఆనందం ఒక్క రోజులో ఆవిరైపోయింది. పెళ్లి తరువాత శోభనం రోజే, పెళ్లి నగలు, రిసెప్షన్ లో వచ్చిన బహుమతుల డబ్బు, ఇతర కానుకలను తీసుకుని పారిపోయిందో వధువు. బీహార్ లోని బాబువా పట్టణంలో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళితే, షీలాదేవి (70) అనే మహిళకు పింటూ (40) అనే కుమారుడు ఉన్నాడు. పింటూకు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరలేదు. ఎట్టకేలకు ఓ బంధువు ద్వారా సంబంధం వచ్చింది. వధువు పేరు సంగీతకుమారి. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో, షీలాదేవే ఖర్చంతా పెట్టి పెళ్లి జరిపించింది. అదే రోజు రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు. తాను నెలసరిలో ఉన్నానని చెప్పిన సంగీత, మరో గదిలో పడుకుంది. తెల్లారిలేచే సరికి ఆమె కనిపించలేదు. రాత్రి ఇల్లొదిలి వెళుతూ నగలు, కానుకలు, రూ. 20 వేల నగదును తీసుకుని మరీ వెళ్లిపోయింది. దీంతో షాక్ తిన్న వారు, పోలీసులను ఆశ్రయించి, మోసకారితో సంబంధం కుదిర్చారంటూ తమ బంధువుపై కేసు పెట్టారు.