Karnataka: శ్రీశైలానికి తగ్గిన వరద... వర్షాలు లేకుంటే ఇప్పట్లో నిండటం కష్టమే!
- కర్ణాటకకు ముఖం చాటేసిన వానలు
- 2.50 లక్షల నుంచి 60 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద
- 873 అడుగులకు చేరిన నీటిమట్టం
గడచిన నాలుగైదు రోజులుగా ఎగువ కర్ణాటక, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో చెప్పుకోతగ్గ వర్షాలు లేకపోవడంతో శ్రీశైలానికి వస్తున్న వరద గణనీయంగా తగ్గింది. మూడు రోజుల క్రితం 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉన్న వరద, ఈ ఉదయం 65 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 62,360 క్యూసెక్కుల నీరు వస్తుండగా, కుడి, ఎడమ కాలువల ద్వారా 18,153 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
మొత్తం 885 అడుగుల నీటి మట్టం ఉండే జలాశయంలో ప్రస్తుతం 873 అడుగులకు నీరు చేరింది. ఎగువన వర్షాలు కురవకుంటే రిజర్వాయర్ నిండి, గేట్లను ఎత్తివేసే పరిస్థితి ఇప్పట్లో రాదని అధికారులు వెల్లడించారు. శ్రీశైలం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండి వుండటంతో ఏ మాత్రం వానలు కురిసినా, వచ్చే నీరంతా శ్రీశైలానికే వస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.