Cricket: క్రికెట్‌కు కులాన్ని ఆపాదిస్తారా.. ఆంగ్ల వెబ్‌సైట్‌పై నిప్పులు చెరిగిన మహ్మద్ కైఫ్
- భారత క్రికెట్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం లేదంటూ కథనం
- కులమతాలకు అతీతమైనది క్రీడారంగమన్న కైఫ్
- మీ సంస్థలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులు ఉన్నారు?
భారత క్రికెట్లోనూ అసమానత్వం రాజ్యమేలుతోందని, జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన ప్రాధాన్యం ఎస్సీ, ఎస్టీ ఆటగాళ్లకు దక్కడం లేదంటూ ఓ ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించిన కథనంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ఈ ఆర్టికల్‌పై ఇప్పటికే విమర్శలు రాగా, తాజాగా స్పందించిన కైఫ్ ఆ వార్త ప్రచురించిన ‘ది వైర్’ ఆంగ్ల వెబ్‌సైట్‌పై నిప్పులు చెరిగాడు. మీ సంస్థలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులు ఉన్నారో చెప్పాలని నిలదీశాడు. ఎంతమంది సీనియర్ ఎడిటర్లు ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నారంటూ నిప్పులు చెరిగాడు.
క్రీడలు అనేవి కులమతాలకు అతీతమైనవని, ఆ అడ్డంకులు దాటిన రంగం ఏదైనా ఉందంటే అది క్రీడా రంగం ఒక్కటేనని వివరించాడు. ఇక్కడ ఆటగాళ్లు కలుపుగోలుగా ఆడతారని పేర్కొన్నాడు. ద్వేషాన్ని విస్తరింపజేసే జర్నలిజం మనకు అక్కర్లేదంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. కైఫ్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. క్రికెట్ నుంచి రిటైరైనా సిక్సర్లు కొట్టడం ఆపడం లేదంటూ ప్రశంసిస్తున్నారు.
‘ది వైర్’ వెబ్సైట్ తన కథనంలో.. ‘‘భారత్‌కు టెస్ట్ హోదా వచ్చి 86 ఏళ్లు దాటింది. ఇన్నేళ్లలో 290 మంది దేశం కోసం ఆడారు. వీరిలో నలుగురు మాత్రమే ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు ఉన్నారు. జనాభా ప్రకారం చూస్తే నిజానికి 70 మంది ఆడాలి. కానీ నలుగురికి మాత్రమే ఆ అవకాశం లభించింది. ఇది వివక్షే. ఈ అసమానత్వాన్ని తేలిగ్గా తీసుకోలేం’’ అని పేర్కొంది. ఈ కథనంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.