Amaravati: కేంద్రం నిధులివ్వకపోవడంతో... అమరావతి కోసం రూ. 20 వేల కోట్ల అప్పుకు ఏపీ ప్లాన్!

  • ఇప్పటికే రూ. 4 వేల కోట్ల రుణానికి అంగీకరించిన ఆంధ్రా బ్యాంకు
  • ఎస్బీఐ, కెనరా బ్యాంకులతో సీఆర్డీయే చర్చలు
  • సెప్టెంబర్లో వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల లభ్యత మందగించిన నేపథ్యంలో, రూ. 20 వేల కోట్లను సమీకరించాలని సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) భావిస్తోంది. ఇందులో కనీసం రూ. 10 వేల కోట్లను జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని భావిస్తున్న అధికారులు, ఇప్పటికే బ్యాంకులను సంప్రదించారు. రూ. 4 వేల కోట్ల నిధులను ఇచ్చేందుకు ఆంధ్రా బ్యాంకు గతంలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులతో రుణం కోసం అధికారులు చర్చలు సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కౌంటర్ గ్యారంటీని ఆఫర్ చేస్తున్నారు. "ప్రభుత్వం తరఫున కౌంటర్ గ్యారెంటీని ఇచ్చే అంశంపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అతిత్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం" అని సీఆర్డీయే ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి తీసుకోవాలని భావిస్తున్న రూ. 10 వేల కోట్లకు అదనంగా దేశవాళీ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ. 2 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ నిధుల సమీకరణ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో రోడ్ షోలను నిర్వహించనున్నట్టు తెలిపారు. మరో రూ. 4 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు రుణంగా ఇవ్వనుందని, ఆ నిధులు సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల సింగపూర్ కు సీఎం చంద్రబాబునాయుడు వెళ్లిన సమయంలో వరల్డ్ బ్యాంక్ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారని ఉన్నతాధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News