modi: పార్లమెంటులో దోస్తీ.. అసెంబ్లీలో కుస్తీ!: బీజేపీ-టీఆర్ఎస్ పై సీపీఐ నారాయణ సెటైర్
- రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడారు
- అయినా కేసీఆర్ నుంచి స్పందనే లేదు
- పాతబస్తీలో ఒవైసీనే ముఖ్యమంత్రి
ఏపీ విభజనకు సంబంధించి తల్లిని చంపి, బిడ్డను కాపాడారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడితే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి స్పందనే లేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలది పార్లమెంటులో దోస్తీ... అసెంబ్లీలో కుస్తీ అంటూ ఎద్దేవా చేశారు.
నయీం కేసులో సిట్ విచారణ ఏమైందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటికీ... హైదరాబాద్ పాతబస్తీకి వెళ్తే అసదుద్దీన్ ఒవైసీనే సీఎం అని అన్నారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పారు. విమర్శలు రాజకీయపరంగానే ఉండాలని సూచించారు.