karunanidhi: కరుణానిధిని ఏకవచనంతో సంబోధించకండి: నాటి నటి శ్రీప్రియ సూచన
- న్యూస్ రీడర్లకు సూచన చేసిన శ్రీప్రియ
- ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి కరుణానిధి
- ఆయన పేరు చివర ‘గారు’ చేర్చి చదవండి
అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే అధినేత కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో జోరుగా వస్తున్నాయి. అయితే, న్యూస్ రీడర్లు కరుణానిధికి సంబంధించిన వార్తలు చదివేటప్పుడు ఆయన్ని ఏకవచనంతో సంబోధిస్తున్నారని, ఇలా పలకడం తగదని ప్రముఖ నటి శ్రీప్రియ మండిపడుతున్నారు.
వయసులోనూ, హోదాలోనూ, జ్ఞానంలోనూ ఉన్నత స్థితిలో ఉన్న కరుణానిధిని ఏకవచనంతో సంబోధించవద్దని, ఆయన పేరు చివర ‘గారు’ చేర్చి చదవాలని టీవీ యాంకర్లకు ఆమె సూచించారు. పెద్దలను మర్యాదపూర్వకంగా సంబోధించడం నేర్చుకుంటారని ఆశిస్తున్నానని ఆమె అన్నారు. కాగా, 1970లలో శ్రీప్రియ కథానాయికగా పలు చిత్రాలలో నటించింది. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లో ఆమె నటించారు. అగ్ర నటులు రజనీకాంత్, కమలహాసన్ లతో ఆమె నటించారు.