Tollywood: ప్రముఖ తెలుగు నిర్మాత కె.రాఘవ కన్నుమూత!
- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన రాఘవ
- శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ
- పరామర్శకు తరలుతున్న సినీ జనం
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కె.రాఘవ (105) కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కె.రాఘవ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. జగత్ జంత్రీలు, జగత్ కిలాడీలు, తాతా-మనవడు, సంసారం సాగరం, చదువు-సంస్కారం, తూర్పు-పడమర, అంతులేని వింత కథ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంటి చిత్రాలను రాఘవ నిర్మించారు. ఆయన నిర్మించిన 27 సినిమాల్లో 25 సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడం విశేషం.
దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి పలువురు దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన రాఘవ, ఎటువంటి పరిస్థితులలోనైనా సరే ముందు వేసుకున్న బడ్జెట్టులోనే చిత్రాన్ని నిర్మించేవారు. రాఘవ మృతి వార్తతో టాలీవుడ్ చిన్నబోయింది. చిత్రపరిశ్రమలో విశేష అనుభవం ఉన్న ఆయన మృతి చెందారన్న వార్త విని కన్నీరు పెట్టుకున్నారు. పరామర్శించేందుకు సినీ పెద్దలు ఆయన ఇంటికి తరలుతున్నారు.