malya: కొట్టేసిన సొమ్ము క్రికెట్ జట్టుకు.. మాల్యా నిర్వాకం: బయటపెట్టిన జాతీయ చానెల్
- ఆర్ సీబీ జట్టుకు ఈ సొమ్ముతోనే చెల్లింపులు
- మాల్యా- ఉన్నతాధికారుల ఈ మెయిల్స్ బట్టబయలు
- రూ.500 కోట్లు మళ్లించినట్లు ఆరోపణ
బ్యాంకుల వద్ద రూ.10,000 కోట్ల రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా వాటిని ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సీబీ)జట్టుకు మళ్లించాడని ఓ జాతీయ ఆంగ్ల చానెల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ జట్టుతో పాటు ఫార్ములా వన్ రేస్ జట్టు 'ఫోర్స్ ఇండియా'కు మాల్యా భారీ చెల్లింపులు చేశాడని వెల్లడించింది.
కింగ్ ఫిషర్ నిర్వహణ పేరిట నగదును విదేశాలకు తరలించి అక్కడ్నుంచి వాటిని ఫోర్స్ ఇండియా, ఆర్ సీబీ జట్టుకు చెల్లించాడని సదరు చానెల్ పేర్కొంది. ఈ మేరకు మాల్యా, అతని సంస్థలోని ఉన్నతాధికారులకు మధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణల్ని బయటపెట్టింది. ప్రస్తుతం మాల్యాపై బ్రిటన్ లోని న్యాయస్థానంలో అక్రమ నగదు చలామణి కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
భారత్ లోని యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి బ్రిటన్ లోని హెచ్ డీ ఎఫ్ సీ ఖాతాకు ఇలా వేర్వేరు సందర్భాల్లో రూ. 500 కోట్లను మళ్లించారని ఈ-మెయిల్స్ లో తేలింది. అసలే నష్టాల్లో ఉన్న కింగ్ ఫిషర్ సంస్థ ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ఎందుకు స్పాన్సర్ చేస్తుందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కింగ్ ఫిషర్ సీఎఫ్ వో రఘునాథ్ మాల్యాకు మెయిల్ చేశాడు. అయినా బ్యాంకుల నుంచి రుణాలకు ఇబ్బంది ఉండబోదని హామీ కూడా ఇచ్చాడు.