ARMENIA: భార్య ఏదో అడిగితే భూగర్భంలో ఏకంగా కోటనే కట్టేసిన భర్త!
- ఆర్మేనియాలో ఆర్కిటెక్ట్ అద్భుతం
- చేతి పనిముట్లతో కోట లాంటి నిర్మాణం
- భారీగా వస్తున్న పర్యాటకులు
భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ ను కట్టిన షాజహాన్ గురించి చదువుకున్నాం. భార్య పుట్టిన రోజున విలాసవంతమైన నౌకల్ని బహుమతిగా ఇచ్చే పారిశ్రామికవేత్తల్నీ మనం చూశాం. అయితే వస్తువులు దాచుకోవడానికి ఇంటి కింద చిన్న బేస్ మెంట్ కట్టాలని కోరిన భార్యకు ఆమె భర్త విచిత్రమైన బహుమతి ఇచ్చాడు. రోజూ కొంచెం కొంచెం తవ్వుతూ భూగర్భంలో ఏకంగా ఓ చిన్న కోటను నిర్మించాడు. దాన్ని అందమైన కళాఖండంగా తీర్చిదిద్దాడు. దీంతో ఆ నిర్మాణం ఆర్మేనియాలో ఇప్పుడు పర్యాటకులకు గమ్యస్థానంగా మారింది. ఆర్మేనియాలోని అరింజ్ గ్రామానికి చెందిన లెవోన్ అరకెల్యాన్ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఆయన భార్య టోస్యా ఓ రోజు.. ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు దాచుకోవడానికి చిన్న బేస్ మెంట్ ను నిర్మించాలని భర్తను కోరింది.
భార్య అడిగిందే తడవుగా లెవోన్ రంగంలోకి దిగిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23 ఏళ్ల పాటు భూమిని తొలిచి, నిర్మాణాలు చేస్తూనేపోయాడు. ఇందులో భాగంగా చేతి పనిముట్ల సాయంతోనే 600 టన్నుల మట్టి, రాళ్లను తవ్వి పడేశాడు.
దీంతో ఈ పనిని ఆపేయాలని భార్య పలుమార్లు కోరింది. అయినా లెవోన్ వినిపించుకోలేదు. చివరికి పని పూర్తి కాగానే భూగర్భంలో అద్భుతమైన కోట లాంటి నిర్మాణం ఆవిష్కృతమైంది. ఈ విషయమై టోస్యా మాట్లాడుతూ.. తన భర్త రోజుకు 18 గంటలు భూగర్భంలో పనిచేస్తూ ఉండేవాడని తెలిపింది. కేవలం చేతి పనిముట్ల సాయంతోనే లెవోన్ ఈ అద్భుతాన్ని సృష్టించాడని కితాబిచ్చింది. నిండా 6 వేల జనాభా లేని తమ గ్రామానికి లెవోన్ కారణంగా పర్యాటకులు వస్తున్నారని చెప్పింది.