muchharla aruna: చిన్నప్పుడు అబద్ధాలు బాగా చెప్పేదానిని: ముచ్చర్ల అరుణ
- ఫ్రెండ్స్ తో బాగా ఆటలు ఆడేదానిని
- నిద్రలేచేసరికి ఆలస్యమయ్యేది
- ప్రిన్సిపాల్ రూమ్ లో అమ్మను చూసి షాక్ అయ్యాను
తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముచ్చర్ల అరుణ, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్ననాటి విషయాలను కూడా పంచుకున్నారు. "అప్పుడు నేను 6వ క్లాస్ చదువుతున్నాననుకుంటాను. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ తో ఆటలే సరిపోయేవి. మరుసటి రోజు స్కూల్ కి సంబంధించిన పనులను పూర్తిచేసుకుని ఉండమని మా అమ్మ చెబుతూ ఉండేది. నేను మాత్రం అంతా ఓకే అని అబద్ధం చెప్పేదానిని.
ఆలస్యంగా నిద్ర లేవడం వలన ఆలస్యంగానే స్కూల్ కి వెళ్లే దానిని. ఒక రోజున అమ్మకి యాక్సిడెంట్ అయిందనీ .. మరో రోజున ఇంకా హాస్పిటల్లోనే ఉందనీ .. అబద్ధాలు చెప్పేసి క్లాస్ లోకి వెళ్లిపోయేదానిని. ఇంకో రోజున కూడా అమ్మకి ఒంట్లో బాగోలేదని చెప్పి .. క్లాస్ లోకి వెళ్లబోయాను. ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్లమంటే వెళ్లాను. అక్కడ మా అమ్మను చూసి షాక్ అయ్యాను. స్కూల్ వాళ్లు కబురుచేస్తే అమ్మ వచ్చిందని తెలిసి గిల్టీగా ఫీలయ్యాను. అప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం మానేశాను" అని చెప్పుకొచ్చారు.