Maharashtra: ఒక్క జోక్ 33 మంది ప్రాణాలు తీసింది.. మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంపై అసలు కారణం వెలుగులోకి!
- వివరాలు తెలిపిన బాధితుడు దేశాయ్
- జోక్ వేయడంతో వెనక్కు తిరిగిన డ్రైవర్
- అదుపు తప్పడంతో లోయలోకి జారిపోయిందని వెల్లడి
మహారాష్ట్రలో ఇటీవల ఓ బస్సు అదుపు తప్పడంతో అందులోని 33 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయపడ్డ ఏకైక వ్యక్తి ప్రకాశ్ సావంత్ దేశాయ్ సంచలన విషయాన్ని బయటపెట్టారు.
బస్సు అంబేనాలి ఘాట్ సమీపంలోకి వచ్చిన సమయంలో వాహనంలోని ఓ మిత్రుడు జోక్ వేశాడని తెలిపారు. దీంతో అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారన్నారు. పెద్ద శబ్దంతో నవ్వులు రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడనీ, అంతలోనే బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోయిందని దేశాయ్ వెల్లడించారు.
బస్సు లోయలోకి పడిపోతుండగా ముందు అద్దం పగిలిపోయిందని దేశాయ్ అన్నారు. దీంతో డ్రైవర్ పక్కనే కూర్చున్న తాను ఒక్కసారిగా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నానని తెలిపారు. ఆ తర్వాత రోడ్డు పైకొచ్చి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించానని వెల్లడించారు.మహారాష్ట్రలోని కొంకణ్ వ్యవసాయ వర్సిటీకి చెందిన 34 మంది సిబ్బంది దపోలీ నుంచి మహాబలేశ్వర్ కు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.