hollywood: 'మిషన్ ఇంపాజిబుల్'కు ‘కశ్మీర్’ షాక్.. అభ్యంతరకర సన్నివేశాలకు సెన్సార్ బోర్డ్ కత్తెర!
- కశ్మీర్ ను తప్పుగా చూపడంపై అభ్యంతరం
- మరికొన్ని సీన్లను తొలగించాలని ఆదేశం
- కశ్మీర్ లో అనుమతి ఇవ్వకపోవడంతో న్యూజిలాండ్ వెళ్లామన్న దర్శకుడు
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్’ భారత్ లో జూలై 27న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ సమయంలో ఈ సినిమాలో కశ్మీర్ కు సంబంధించి కొన్ని సీన్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ) కొన్ని కట్స్ చెప్పినట్టు సినిమా వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సన్నివేశంలో కశ్మీర్ ను భారత ఆక్రమిత కశ్మీర్ గా చూపడంపై సీబీఎఫ్ సీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే జమ్మూకశ్మీర్ సరిహద్దు తప్పుగా ఉన్న మ్యాపుల్ని చిత్రంలో చూపించే సీన్ ను కూడా తొలగించాలని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా ‘ఈ సినిమాలోని సన్నివేశాలు ఏ మతం, ప్రాంతం, కులం, జాతి ప్రజల్ని బాధ పెట్టేందుకు, అగౌరవపర్చేందుకు ఉద్దేశించినవి కాదు’ అని సినిమా ప్రదర్శనకు ముందు ప్రకటన ఇవ్వాలని సూచించారు.
ఈ చిత్ర దర్శకుడు మెక్ క్వరీ మాట్లాడుతూ.. తొలుత యాక్షన్ సన్నివేశాలను కశ్మీర్ లో షూట్ చేయాలనుకున్నామనీ, కానీ అనుమతులు లభించకపోవడంతో అలాంటి వాతావరణమే ఉన్న న్యూజిలాండ్ ను ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.