England: ఆటకు అంతరాయం కలిగించి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన పావురం.. తిట్టుకుంటున్న ఇంగ్లండ్ అభిమానులు!
- భారత్‌కు ఫేవర్ చేసిన పావురం
- జెన్సింగ్స్ ఏకాగ్రతను దెబ్బ తీసిన వైనం
- టపటపా వికెట్లు రాల్చుకున్న ఇంగ్లండ్
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు మొదలైంది. వన్డే సిరీస్ కోల్పోయి కసి మీద ఉన్న భారత్ టెస్టు సిరీస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టుగా జట్టులో పలుమార్పులు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ కీలకం కావడంతో మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లినట్టు అందరూ భావించారు. అయితే, భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంతో మ్యాచ్ తిరిగి భారత్ చేతుల్లోకి వచ్చింది. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.
పానకంలో పుడక...
35 ఓవర్లు పూర్తయ్యాయి. తర్వాతి ఓవర్ వేసేందుకు సీమర్ మహమ్మద్ షమీ బంతి అందుకున్నాడు. ఓపెనర్ కీటన్ జెన్సింగ్స్ (42), కెప్టెన్ జో రూట్ (80) క్రీజులో ఉన్నారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు బౌలర్లు నానా కష్టాలు పడుతున్నారు. కెప్టెన్ కోహ్లీ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక, బంతి అందుకున్న షమీ బౌలింగ్‌కు సిద్ధమవుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పావురం వచ్చి పిచ్‌పై వాలింది. దీంతో కొంతసేపు ఆట నిలిచిపోయింది. పిచ్‌పై నుంచి పావురాన్ని పంపేందుకు జెన్సింగ్స్ కష్టపడ్డాడు.
మొత్తానికి అందరూ కలిసి దానిని అక్కడి నుంచి పంపించారు. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న జెన్సింగ్స్‌కు పావురం రూపంలో అవాంతరం ఎదురుకావడంతో ఏకాగ్రత కోల్పోయాడు. ఫలితంగా షమీ వేసిన తొలి బంతికే బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అశ్విన్ విజృంభించడంతో ఇంగ్లిష్ బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. 97/1తో బలంగా ఉన్న జట్టు తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. పావురం చేసిన పనికి ఇంగ్లిష్ ఆటగాళ్లే కాదు, అభిమానులు కూడా తిట్టుకుంటున్నారు.