Donald Trump: అబ్బే.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ట్రంప్ భారత్ రాకపై వైట్‌హౌస్
- గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా ట్రంప్‌కు ఆహ్వానం
- ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్న అమెరికా
- 2 ప్లస్ 2 చర్చల్లో నిర్ణయిస్తామని స్పష్టీకరణ
భారత గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ స్పష్టం చేశారు. భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావాలా? వద్దా? అనేది అమెరికా-భారత్ మధ్య సెప్టెంబరులో జరిగే 2 ప్లస్ 2 చర్చల్లో తేలుతుందన్నారు.
వచ్చే ఏడాది జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ట్రంప్‌ను భారత ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్ నుంచి ట్రంప్‌కు ఆహ్వానం అందిందని, అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సారా తెలిపారు. కాగా, అమెరికా-ఇండియా 2 ప్లస్ 2 తొలి విడత చర్చల్లో భాగంగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, మైక్ పోంపెయోలో త్వరలోనే భారత్ వెళ్లనున్నట్టు సారా వెల్లడించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారని పేర్కొన్నారు. 2 ప్లస్ 2 చర్చల్లోనే ట్రంప్ భారత పర్యటనపై చర్చ జరుగుతుందని సారా పునరుద్ఘాటించారు.