Telangana: తెలంగాణలో ఉత్పత్తిని నిలిపివేసిన డిస్టలరీలు.. మందుబాబుల గగ్గోలు!
- భారీగా లైసెన్స్ ఫీజు వసూలుపై ఆగ్రహం
- సీఎం చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన
- ప్రభుత్వానికి రోజుకు రూ.24 కోట్ల నష్టం
తెలంగాణలో మద్యానికి త్వరలోనే కొరత ఏర్పడనుంది. ప్రభుత్వం భారీగా వసూలు చేస్తున్న లైసెన్స్ ఫీజులను నిరసిస్తూ తెలంగాణ డిస్టలరీల సంఘం బుధవారం నుంచి మద్యం ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో రోజుకు ప్రభుత్వానికి రూ.24 కోట్ల మేర నష్టం వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 19 డిస్టలరీలు ఉండగా.. వీటిలో 14 డిస్టలరీలు బుధవారం మద్యం ఉత్పత్తిని నిలిపివేశాయి. ఉమ్మడి ఏపీలో 12 బాటిళ్లు ఉన్న ఓ కేస్ ఉత్పత్తికి రూ.6.50 ను ప్రభుత్వం వసూలు చేసేది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఓ కేస్ కు ఏకంగా రూ.13 వసూలు చేస్తున్నారు. దీనివల్ల ఒక్కో డిస్టలరీ ఏటా రూ.1.56 కోట్ల లైసెన్స్ ఫీజును చెల్లించుకోవాల్సి వస్తోందని వీటి యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ డిస్టలరీల సమ్మె నేపథ్యంలో మద్యానికి కొరత ఏర్పడుతుందేమో అని మందు బాబులు ఆందోళన చెందుతున్నారు.
పొరుగునే ఉన్న ఏపీలో డిస్టలరీలు ఎంత మద్యాన్ని ఉత్పత్తి చేసుకున్నా.. ఏటా రూ.78 లక్షలు చెల్లిస్తే చాలనీ, ఇదే తరహా విధానం మహారాష్ట్ర, తమిళనాడుల్లో సైతం ఉందని చెబుతున్నాయి. లైసెన్స్ ఫీజుల్ని తగ్గించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినప్పటికీ ఎక్సైజ్ అధికారులు వినడం లేదని ఓ డిస్టలరీ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, బుధవారం ఎక్సైజ్ మంత్రి పద్మారావుతో సంఘం ప్రతినిధులు జరిపిన చర్చలు సైతం కొలిక్కి రాకుండానే ముగిశాయి. తాజా నిర్ణయంతో తెలంగాణలో రోజుకు 80 వేల కేస్ ల మద్యం ఉత్పత్తి నిలిచిపోనుంది.