Maharashtra: వాక్ స్వాతంత్ర్యం సంగతి పక్కన పెట్టండి... కనీసం స్వేచ్ఛగా నడవలేని దుర్గతిలో ఇండియా: బాంబే హైకోర్టు
- మహారాష్ట్ర హత్యలపై విచారణ
- సీఐడీ, సీబీఐ విచారణ సంతృప్తిగా లేదన్న హైకోర్టు
- విచారణను సాగదీశారని అభిప్రాయం
ఇండియాలోని ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం కరవైందని, కనీసం స్వేచ్ఛగా కూడా తిరగలేని దుస్థితిలోకి దేశం నెట్టివేయబడిందని బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో కలకలం రేపిన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే హత్య కేసుల విచారణను న్యాయస్థానం పర్యవేక్షణలో జరిపించాలన్న పిటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ పిటిషన్ ను విచారిస్తున్న జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ భారతీ డాంగ్రేలు కేసుల విచారణ సంతృప్తికరంగా జరగలేదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర సీఐడీ, సీబీఐ ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో ఏమాత్రం ఉపయోగకరమైన సమాచారం లేదని బెంచ్ పేర్కొంది. ఇండియాలో ఓ 'విషాద దశ' నడుస్తోందని, ఈ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు భావించలేదని, హత్యలపై అనాసక్తిగా దర్యాఫ్తు జరిపినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా, దబోల్కర్ హత్య 2013 ఆగస్టు 20న జరుగగా, పన్సారే పై 2015 ఫిబ్రవరి 16న కాల్పులు జరుపగా, ఆయన అదే నెల 20న మరణించారు.