imran khan: ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కూటమి.. షరీఫ్, భుట్టో పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం!
- ఒకే తాటిపైకి వచ్చిన పీఎంఎల్, పీపీపీ, ఎంఎంఏ, ఏఎన్పీ
- ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ పార్లమెంటును కోరనున్న కూటమి
- పీటీఐ రిగ్గింగ్ చేసి గెలిచిందంటూ విమర్శలు
పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించబోతున్న తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పలు విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. షరీఫ్ కు చెందిన పీఎంఎల్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్), భుట్టోకు చెందిన పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ) పాటు ఎంఎంఏ, ఏఎన్పీలు ఒక తాటిపైకి వచ్చాయి. ఈ పార్టీలన్నింటికీ కలిపి 120 సీట్లు ఉన్నాయి. తమకు ఉన్న మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పార్లమెంటును కోరనున్నట్టు ఈ కూటమి తెలిపింది.
కూటమిలోని వివిధ పార్టీల నేతలు నిన్న సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వివిధ పార్టీల అభిప్రాయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని 16 సభ్యుల కమిటీ ఓ డ్రాఫ్ట్ ను తయారు చేసిందని తెలిపారు. చర్చల్లో భాగంగా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిత్వాన్ని పీఎంఎల్ కు, స్పీకర్ అభ్యర్థిని పీపీపీకి, డిప్యూటీ స్పీకర్ అభర్థిని ఎంఎంఏ పార్టీలకు కేటాయించేలా ఒప్పందం కుదిరిందని చెప్పారు.
ఈ సందర్భంగా పీపీపీ నేత షెర్రీ రెహ్మాన్ మాట్లాడుతూ, రిగ్గింగ్ ద్వారానే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఈ ఫలితాలను సాధించిందని విమర్శించారు. సైన్యం చేతిలో కీలుబొమ్మలా ఉండే ఇమ్రాన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, పార్లమెంటు వెలుపల నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కూటమి తరపున ఒక జాయింట్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశామని... త్వరలోనే అన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు. మరోవైపు పీఎంఎల్ అధ్యక్షుడు షెహ్భాజ్ షరీఫ్ ప్రధాని అభ్యర్థిగా, పీపీపీ నేత ఖుర్షీద్ షా స్పీకర్ అభ్యర్థిగా ఉండవచ్చని తెలుస్తోంది.