cuddapah: కడపలో వామపక్షాల కార్యకర్తలపై లాఠీఛార్జీని ఖండించిన ‘జనసేన’
- ప్రజల గళం వినిపిస్తున్న పార్టీల గొంతు నొక్కడం తగదు
- చంద్రబాబు ప్రభుత్వం ఈ ధోరణి మార్చుకోవాలి
- చావు బతుకుల్లో ఉన్న కార్యకర్తకు వైద్యం అందించాలి
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం వామపక్షాలు చేపట్టిన ఆందోళనపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒక కార్యకర్త చావుబతుకుల్లోకి వెళ్లడం బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు భాగమని, ఆ క్రమంలోనే వామ పక్షాలు కలెక్టరేట్ ముట్టడి చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ‘జనసేన’ ఖండిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం పేర్కొన్నారు.
విభజన హామీల్లో భాగమైన కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని, పాలక పక్షంవారి దీక్షలకు బందోబస్తు ఇస్తున్నారని, ప్రజల గళం వినిపిస్తున్న పార్టీల గొంతు నొక్కేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, చావు బతుకుల్లో ఉన్న కార్యకర్తకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.