Google: తెలియకుండానే ఫోన్లో దూరిపోయిన ఆధార్ టోల్ ఫ్రీ... తమ తప్పేనంటూ క్షమాపణలు చెప్పిన గూగుల్!
- 80 శాతం స్మార్ట్ ఫోన్లలో తెలియకుండానే చేరిన నంబర్
- 2014లో యూఐడీఏఐ టోల్ ఫ్రీ నంబర్ ను కోడ్ చేశామన్న గూగుల్
- మాన్యువల్ గా డిలీట్ చేసుకోవచ్చంటూ వివరణ
దేశంలోని 80 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్లలో 'యూఐడీఏఐ' టోల్ ఫ్రీ నంబర్ గా చేరిపోయిన 18003001947 నంబర్ ఆధార్ భద్రతపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్న వేళ, గూగుల్ స్పందించింది. తమ పొరపాటు వల్లే ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ గా ఇది స్మార్ట్ ఫోన్లలో చేరిపోయిందని, ఆండ్రాయిడ్ అప్ డేట్ లను అభివృద్ధి చేస్తున్న వేళ ఈ నంబర్ చేరిందని వెల్లడించింది. జరిగిన తప్పుకు మన్నించాలని కోరింది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డీఫాల్ట్ గా ఉండటం వల్లే, సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయిన సమయంలో యూజర్ కు తెలియకుండా ఈ నంబర్ ఇన్ స్టాల్ అయిందని గూగుల్ వెల్లడించింది. 2014 సంవత్సరంలో యూఐడీఏఐ హెల్ప్ లైన్ నంబర్ ను కోడ్ చేశామని, ఆపై అదే వర్షన్ ను ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్స్)లకు ఇచ్చామని పేర్కొంది. ఈ నంబర్ ను మాన్యువల్ గా డిలీట్ చేసుకోవచ్చని, భవిష్యత్తులో వచ్చే ఆండ్రాయిడ్ వర్షన్ లలో ఈ నంబర్ ఉండదని తెలిపింది.