Neerav Modi: నీరవ్ మోదీని పంపాల్సిందిగా యూకేను అభ్యర్థించిన భారత్
- పార్లమెంటుకు తెలిపిన మంత్రి వీకే సింగ్
- భారత్ విన్నపాన్ని 9 సార్లు తిరస్కరించిన బ్రిటన్
- నీరవ్ ఎక్కడున్నాడో తెలియదన్న మంత్రి
పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర ముంచేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీని తమకు అప్పగించాల్సిందిగా భారత్ కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలియజేశారు. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న భారత ఆర్థిక నేరగాళ్లను తిరిగి వెనక్కి పంపాల్సిందిగా 2002 నుంచి బ్రిటన్ను కోరుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. అయితే, భారత ప్రభుత్వ వినతులను గత 16 ఏళ్లలో బ్రిటన్ ప్రభుత్వం 9 సార్లు తిరస్కరించినట్టు పేర్కొన్నారు. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మరో ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను కూడా భారత్ పంపాల్సిందిగా పలుమార్లు కోరినట్టు తెలిపారు.
భారత్‌లో మోసాలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన నేరగాళ్లలో నీరవ్ మోదీ 29వ ఆర్థిక నేరగాడని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీల పాస్‌పోర్టును ఫిబ్రవరిలోనే రద్దు చేసినట్టు చెప్పిన ఆయన నీరవ్ ఎక్కడ ఉన్నాడన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఇదే కుంభకోణంలో మరో నిందితుడైన మేహుల్ చోక్సీ మాత్రం అంటిగ్వాలో ఉన్నట్టు ఆ దేశ ప్రభుత్వం నిర్ధారించినట్టు మంత్రి తెలిపారు.