ALBERT EINSTEIN: ఐన్ స్టీన్ ను మించిన బాల మేధావులు.. ఈ అక్కా చెల్లెళ్లు!
- భారత సంతతి బ్రిటిషర్లు నిష్కా, నైసాల ఘనత
- మెన్సా టెస్ట్ లో ఏకంగా 162 పాయింట్లు
- భవిష్యత్ లో లాయర్లు అవుతామని వెల్లడి
బ్రిటన్ కు చెందిన ఇద్దరు భారత సంతతి బాలికలు అద్భుతం సృష్టించారు. మెన్సా ఐక్యూ పరీక్షలో 162 పాయింట్లతో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు స్టీఫెన్ హాకింగ్, అల్బర్ట్ ఐన్ స్టీన్ లను అధిగమించారు.
బ్రిటన్ లోని హెర్ట్ ఫోర్డ్ షైర్ లో ఉంటున్న నిష్కా, నైసాలు కేవలం 11 ఏళ్ల వయసులోనే ఈ ఘనతను సాధించారు. చిన్నారుల్లో తెలివితేటలను గుర్తించేందుకు నిర్వహించిన మెన్సా ఐక్యూ పరీక్షలో ఈ ఇద్దరు కవలలు ఏకంగా 162 పాయింట్లు సాధించారు. ఈ టెస్ట్ లో 140 పాయింట్లు సాధించేవాళ్లను మేధావులుగా పరిగణిస్తారు. మేధావులుగా ప్రపంచం కీర్తించే ఐన్ స్టీన్, హాకింగ్ ల ఐక్యూ 160 పాయింట్లు మాత్రమే. ఈ స్థాయి మేధస్సు కలిగినవాళ్లు ప్రపంచంలో ప్రస్తుతం కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు.
ఈ సందర్భంగా నిష్కా, నైసాలు మాట్లాడుతూ.. అత్యుత్తమ స్కోర్ ను సాధిస్తామని తాము అస్సలు ఊహించలేదని చెప్పారు. భవిష్యత్ లో తామిద్దరం లాయర్లు కావాలనుకుంటున్నామని వెల్లడించారు. తాము సోషల్ మీడియా, స్నాప్ చాట్, వీడియో గేమ్ లకు దూరంగా ఉంటామనీ, ఇదే తమ విజయ రహస్యమని అన్నారు. మరోవైపు తండ్రి వరుణ్ మాట్లాడుతూ.. ఓ దినపత్రికలో ప్రకటనను చూసి మెన్సా టెస్ట్ రాయాల్సిందిగా తన కుమార్తెలకు సూచించానని తెలిపారు. నిష్కా, నైసాలు కేవలం నిమిషం వ్యవధితో పుట్టారని వెల్లడించారు.