Chandrababu: జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నా: చంద్రబాబు
- రాష్ట్ర జనాభా పెరుగుదల ఆగిపోయింది
- ఈ పరిస్థితి కొనసాగితే యువతరం తగ్గిపోతుంది
- రోబోలు వచ్చినా.. మనకు ప్రత్యామ్నాయం కాలేవు
రాష్ట్ర జనాభా పెరగడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదల ఆగిపోయిందని ఆయన చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నేళ్ల తర్వాత జనాభా దారుణంగా పడిపోతుందని, యువతరం తగ్గిపోతుందని అన్నారు. భవిష్యత్తులో రోబోలు వచ్చినా, అవి మనకు ప్రత్యామ్నాయం కాలేవని చెప్పారు. అందుకే జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నానని తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో ఈ రోజు జరిగిన జ్ఞానభేరి సదస్సులో విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు సూచించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాల గురించి ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ఎస్వీ యూనివర్శిటీ దేశంలో టాప్ టెన్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నామని... ఇంజినీరింగ్, ఐటీ విద్యలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు.