Salman Khan: విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందే!: సల్మాన్ ఖాన్ కు కోర్టు ఆదేశం

  • ఆగస్టు 10 నుంచి విదేశాలకు సల్మాన్ 
  • అనుమతి లేకుండా వెళ్లేందుకు అంగీకరించం
  • స్పష్టం చేసిన జోధ్ పూర్ సెషన్స్ కోర్టు

విదేశాలకు వెళ్లాలంటే, ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని, ఈ విషయంలో సల్మాన్ ఖాన్ కు ఊరటనిచ్చేది లేదని రాజస్థాన్ లోని జోధ్ పూర్ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలన్న నిబంధన నుంచి తనకు విముక్తి కల్పించాలని సల్మాన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై శనివారం నాడు విచారణ జరిపిన కోర్టు, అనుమతి లేకుండా వెళ్లేందుకు వీల్లేదని పేర్కొంది.

తన క్లయింట్ ఆగస్టు 10 నుంచి 26 మధ్య విదేశాల్లో పర్యటించాల్సి వుందని కోర్టుకు తెలిపిన సల్మాన్ తరఫు న్యాయవాది, న్యాయస్థానానికి తెలియజేయకుండా ఫారిన్ వెళ్లే వీలు కల్పించాలని కోరారు. ఆయన షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడని తెలిపారు. అయితే, అందుకు అనుమతించేది లేదని, అయితే, తన పని నిమిత్తం ముందస్తు అనుమతితో విదేశాలకు వెళ్లవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా, 1998 నాటి కృష్ణజింకల వేట కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, మరో ఇద్దరి జామీనుపై సల్మాన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News