Odisha: యాచకురాలి పాడె మోసిన ఎమ్మెల్యే!
- ఒడిశాలో ఘటన
- మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ రాని వైనం
- విషయం తెలుసుకుని మానవత్వం చూపిన ఎమ్మెల్యే
యాచక వృత్తిలో ఉండి, ఎవరూ లేని అనాధ మరణిస్తే, విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే తనలోని మానవత్వాన్ని చూపుతూ, అంత్యక్రియలు జరిపించడమే కాకుండా, స్వయంగా పాడెను మోశారు. ఈ ఘటన ఒడిశాలోని సంబన్ పూర్ జిల్లా అమనపాలి గ్రామంలో జరిగింది. గ్రామంలోని యాచకురాలు మరణించి, 24 గంటలు గడిచినా, మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ రాలేదు. ఆ విషయం స్థానిక ఎమ్మెల్యే రమేష్ పత్వాకు తెలిసింది.
వెంటనే ఆయన తన కుమారుడు అంకిత్, అల్లుడు బాదల్ లను పిలిచి, ఆ గ్రామానికి వెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని సూచించాడు. ఆపై తన స్నేహితులతో కలసి అక్కడికి వెళ్లి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. చాలా ఏళ్ల నుంచి ఆ గ్రామంలో యాచకురాలు ఉందని, అక్కడే అడుక్కునే ఆమె తనకు తెలుసునని ఈ సందర్భంగా రమేష్ పత్వా వ్యాఖ్యానించారు. ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిసి బాధ కలిగిందని చెప్పారు. మృతదేహాన్ని ముట్టుకుంటే కుల బహిష్కరణ చేస్తారేమోనని ప్రజలు భయపడ్డారని అన్నారు.