Andhra Pradesh: నవ్యాంధ్రలో మరో భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ.. తిరుపతిలో ఏర్పాటు.. పోటీ కారణంగా గోప్యంగా ఉంచిన బాబు సర్కారు!
- మొబైల్ విడిభాగాలను ఉత్పత్తి చేయనున్న కంపెనీ
- తిరుపతిలోని ఈఎంసీలో ఏర్పాటు
- ప్రత్యక్షంగా 6వేల మందికి ఉపాధి అవకాశాలు
- తొలి విడతగా రూ.1400 కోట్ల పెట్టుబడి
- నేడు వివరాలు వెల్లడించనున్న ప్రభుత్వం
నవ్యాంధ్రకు మరో భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ రాబోతోంది. మొబైల్ తయారీ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసే ఈ కంపెనీ తిరుపతిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)-2లో రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. రూ.1400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా ఆరు వేల మందికి, పరోక్షంగా మరింతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
మొబైల్ ఫోన్లకు సంబంధించిన కెమెరా మాడ్యూళ్లు, టీఎఫ్టీ స్క్రీన్లు తయారు చేసే ఈ కంపెనీ దేశంలోనే మొదటిసారి ఏపీలో ఏర్పాటు కానుండడం విశేషం. కంపెనీ ఉత్పత్తి ప్రారంభిస్తే మొబైల్ తయారీ కంపెనీలకు బోలెడంత వెసులుబాటు లభిస్తుంది. విడిభాగాల కోసం విదేశాలపై ఆధారపడే బాధ తప్పుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కంపెనీ ఏర్పాటు ఖాయమైనప్పటికీ ప్రభుత్వం ఈ వివరాలను ఇప్పటి వరకు గోప్యంగా ఉంచింది. ఇతర రాష్ట్రాల నుంచి విపరీతమైన పోటీ ఉండడమే అందుకు కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో సోమవారం కంపెనీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. అనంతరం కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వివరించనున్నారు.
కంపెనీని ఏపీకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సర్కారు విశ్వప్రయత్నాలు చేసి చివరికి సాధించింది. ఢిల్లీలోని నోయిడా, మహారాష్ట్ర నుంచి ఏపీకి ఈ విషయంలో గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ పట్టువిడవని ప్రభుత్వం ఎట్టకేలకు తమ ప్రయత్నాల్లో విజయం సాధించింది. ఇందుకోసం ఏపీ ఐటీ శాఖ అధికారులు రెండుసార్లు చైనాలో పర్యటించారు. ఇంకోసారి మంత్రి లోకేశ్ కంపెనీ ప్రతినిధులను కలిసి ఏపీలోని పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి వారిని ఒప్పించారు.