china: మూడు డాలర్లకు కక్కుర్తి పడితే.. 50 లక్షల కారుకు ఎసరొచ్చింది!.. వీడియో చూడండి
- శుభ్రం చేసేందుకు కారును నదిలోకి దింపిన చైనా వ్యక్తి
- సరిగ్గా అదే సమయంలో ఎగువన ఉన్న డ్యాం గేట్లు ఎత్తివేత
- డబ్బున్నా ఈ కక్కుర్తి ఏంటంటూ నెటిజన్ల జోకులు
ఎవరైనా సరే తమ వాహనాలకు అప్పుడప్పుడు వాటర్ సర్వీసింగ్ చేయిస్తుంటారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ఎందుకు అనుకున్నవారు... సొంతంగా నీటితో వారే క్లీన్ చేసుకుంటారు. కానీ ఓ చైనా వ్యక్తి ఈ రెండు పనులు చేయకుండా... ఓ కక్కుర్తి ఆలోచన చేశాడు. వాటర్ సర్వీసింగ్ చేయించాలంటే మూడు డాలర్లు ఖర్చవుతుందని భావించి, తానే శుభ్రం చేసుకుందామని అనుకున్నాడు. అయితే, ఆ పనిని ఇంటి వద్ద చేయకుండా దగ్గర్లో ఉన్న ఓ నదిలో శుభ్రం చేద్దామని కారును అక్కడకు తీసుకెళ్లాడు. ప్రవాహం తక్కువగా ఉన్న ప్రాంతంలోకి తన ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును దింపాడు.
కారును కడుగుతున్న సమయంలో ఎగువన ఉన్న డ్యాం గేట్లను తెరిచారు. దీంతో, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అవాక్కైన మనోడు కారును అక్కడే వదిలేసి, సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న మరికొందరు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది... అతని కారును ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు ఉన్నవాళ్లు కూడా ఇలా కక్కుర్తి పడటం ఏమిటని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది.