mamatha banerjee: ప్రధాని అభ్యర్థిగా మమతకు మద్దతు ప్రకటించిన దేవేగౌడ
- ఇందిర 17 ఏళ్లు పాలించినప్పుడు.. మమత ప్రధాని ఎందుకు కాకూడదు
- విపక్షాలను ఏకం చేసే క్రమంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది
- రెండు, మూడు నెలల్లో ఏం జరుగుతుందో చూడాలి
2019 ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు విపక్షాలు ఏకమవుతున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మిత్రపక్షాల అభ్యర్థిని ప్రధానిని చేసేందుకు కూడా తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ తెలిపింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ స్పందించారు. విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నిలబెడితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. బీజేపీని అధికారానికి దూరం చేసే క్రమంలో, విపక్ష పార్టీలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేసే క్రమంలో మమత తన శక్తి మేరకు పని చేస్తున్నారని చెప్పారు.
అసోంలో ఎన్ఆర్సీని చేపట్టినప్పటి నుంచి ఫెడరల్ ఫ్రంట్ పై మమత పూర్తి స్థాయిలో దృష్టి సారించారని దేవేగౌడ తెలిపారు. ప్రధానమంత్రిగా 17 ఏళ్లపాటు ఇందిరాగాంధీ పాలించినప్పుడు... మమత కానీ, మాయావతి కాని ప్రధాని ఎందుకు కాకూడదు? అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని... ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ లలో ముస్లింలు ఎన్నో బాధలను అనుభవిస్తున్నారని... ఈ క్రమంలో బీజేపీని గద్దె దించేందుకు ఒక ఫ్రంట్ అవసరమని చెప్పారు. రానున్న 2, 3 నెలల్లో ఏం జరగనుందో వేచి చూడాలని అన్నారు.