Ella Venkateshwararao: టీటీడీపై విరుచుకుపడ్డ ఆస్థాన విద్వాంసుడు ఎల్లా!
- 40 ఏళ్లుగా ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాను
- కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు
- బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించలేదన్న ఎల్లా వెంకటేశ్వరరావు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వైఖరిపై ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఆస్థాన విద్వాంసుడిగా ఉన్న తనను బ్రహ్మోత్సవాలకు పిలవలేదని ఆరోపించిన ఆయన, తనకు కనీస మర్యాదను కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
గత ఐదేళ్లుగా తనను బ్రహ్మోత్సవాల్లో పాల్గొననీయకుండా చేస్తున్నారని, 60 ఏళ్లుగా తాను సంగీత సేవలో ఉండి 70 దేశాల్లో వందలాది కార్యక్రమాలు నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. తనవంటి వారికి టీటీడీలో గుర్తింపు కరవైందని, విషయం ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆయన వాపోయారు. తమ ప్రతిభను ప్రదర్శించిన ఆయా కళాకారులకు గతంలో టీటీడీ అధికారులు పారితోషికం ఇచ్చేవారని, ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.