parliament: ఏపీ పట్ల కేంద్ర వివక్షను నిరసిస్తూ.. లోక్ సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ ఎంపీలు!
- ఏపీపై కేంద్రం వివక్ష చూపడం మానుకోవాలి
- నిధులివ్వకపోవడం కక్ష సాధింపు చర్యే
- యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీది 3వ స్థానం
ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడంపై లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యకు నిరసనగా లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ లు మీడియాతో మాట్లాడారు.
వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం వివక్ష చూపడం మానుకోవాలని, 95 శాతం యూసీలు ఇచ్చినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోగా పీఎంవో చెప్పిందంటూ వెనక్కి తీసుకున్నారని, ఏపీపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని, యూసీలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజ్ అమలు చేస్తామన్నారని, అది అమలు చేస్తే రూ.22 వేల కోట్లు విడుదల చేయాలని అన్నారు.